సైకిల్  పై కలెక్టర్ రాహుల్ రాజ్ ఫీల్డ్ టూర్

సైకిల్  పై కలెక్టర్ రాహుల్ రాజ్ ఫీల్డ్ టూర్
  • తిరుగు ప్రయాణంలో ఆర్టీసీ బస్ లో

మెదక్, రామాయంపేట, వెలుగు:  క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ఆదివారం కలెక్టర్  రాహుల్ రాజ్ సైకిల్  మీద మెదక్ నుంచి రామాయంపేట వరకు ప్రయాణించారు. రామాయంపేట బస్టాండ్ స్థితిగతులను పరిశీలించారు. బస్టాండ్ లో తాగునీరు,  బెంచీలు, ఇతర వసతులు ఎలా ఉన్నాయో చూశారు. శుభ్రతకు సంబంధించి ఆర్టీసీ డీఎంకు సూచనలు చేశారు. బస్టాండ్ ఆధునీకరణకు  చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో  టికెట్ తీసుకుని మెదక్ చేరుకున్నారు.

మహాలక్ష్మి పథకం గురించి మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మెదక్ నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే రోహిత్ రావు అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆయన సహకారంతో ఆర్టీసీ బస్టాండ్లను ఆధునీకరించి మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్ధేశంతో ఈ పర్యటన చేశానన్నారు. అందులో భాగంగానే మెదక్, రామాయంపేట బస్టాండ్ ను  సందర్శించనని చెప్పారు.  

మహిళా శక్తి ద్వారా మహిళా సంఘాలతో బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చి వారి ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తున్నామన్నారు. బస్టాండ్ లో తాగునీరు, పరిశుభ్రత , సౌకర్యాలు మరింత మెరుగు పరిచేలా చర్యలు తీసుకుంటామన్నారు. మెదక్ బస్టాండ్ లో అదనపు ప్లాట్ ఫామ్స్ ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మెదక్ జిల్లాకు కొత్త బస్సులు మంజూరయ్యే విధంగా నివేదికలు పంపించామని చెప్పారు. ఆయన వెంట ఆర్టీసీ డీఎం సురేఖ, అధికారులు, సిబ్బంది ఉన్నారు.